వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రవిబాబు
బాపట్ల: రైతు పక్షపాతిగా మండలి కృష్ణారావు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.రవిబాబు పేర్కొన్నారు. మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రవిబాబు మాట్లాడుతూ బాధలలో ఉన్నవారిని వారు కోరకముందే మనమే వెళ్లి ఓదార్చాలని చెప్పి ఆచరించిన మండలి వెంకట కృష్ణారావు 15 వేల ఎకరాల బంజరు భూమిని పేదలకు పంచి వారి జీవితాలలో వెలుగును ప్రసాదించిన మహనీయుడు అన్నారు. 1977 దివిసీమలో వచ్చిన తుఫాన్‌కి ఆయన సేవలు, అలాగే పులిగడ్డ బ్రిడ్జికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కేవీఎస్ రామిరెడ్డి, డాక్టర్ బి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ లావణ్య, డాక్టర్ కృపావతి, డాక్టర్ ఆరుద్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడు మండలి
వ్యవసాయ కళాశాలలో కృష్ణారావు జయంతి కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ విద్య, సాంస్కృతిక శాఖామంత్రిగా సేవలందించడమేకాక 1975లో మొట్టమొదటిసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు భాష వైశిష్ట్యాన్ని ప్రపంచమంతా చాటారన్నారు. 1977 లో దివిసీమలో సంభవించిన తీవ్ర తుఫాను వలన సర్వం కోల్పోయిన వారిని ఆదుకొని, వారికి పునరావాసాన్ని కల్పించి దివిసీమ గాంధీగా కొనియాడబడ్డారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే తాటిపై నిలవాలని భావించి తెలుగు భాష సంస్కృతిని పోషించడంలో కీలక పాత్ర పోషించిన మండలి వెంకట కృష్ణారావు విద్యార్థులకు ఆదర్శనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ కె.చంద్రశేఖర్, డాక్టర్ వి.ప్రసన్న కుమారి, డాక్టర్ కె.కిరణ్ ప్రకాష్, డాక్టర్ పి.సుధా జాకబ్, డాక్టర్ జి.విజయ్‌కుమార్, డాక్టర్ బి.అపర్ణ, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


