నోటీసులు జారీ చేశాం
చిలకలూరిపేట: జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఉన్న చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ప్రమాదకర రీతిలో ఫ్లయ్‌ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల అనుమతి లేకుండా పనులు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నోటీసు జారీ చేసినా పనులు కొనసాగించటం విశేషం. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గడ్డర్ నేలకొరిగి పెను ప్రమాదం సంభవించింది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 18న జారీ చేసిన నోటీసుకు విలువ లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీతనం ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది.
వాడరేవు నుంచి ...
చీరాల వాడరేవు నుంచి చిలకలూరిపేట మీదుగా నకిరికల్లు వరకు 167ఏ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఓడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర ఓ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు నిర్వహిస్తోంది. బొప్పూడి సమీపంలో చైన్నె నుంచి కోల్‌కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి బైపాస్ రోడ్డుపై ఫ్లయ్‌ఓవర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన నిర్మాణ పనులు పరిశీలించిన జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్... నిర్మాణంలో ఉన్న ఫ్లయ్‌ఓవర్ కింద వాహనాల రాకపోకలు ఎలా అనుమతిస్తారని, ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా పనులు నిర్వహించరాదని సంబంధిత కాంట్రాక్టు సంస్థకు ఈ నెల 18వ తేదీన స్టాప్ వర్క్(పనుల నిలిపివేత) నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండానే పనులు కొనసాగిస్తున్నారు.
గతంలో కూలిన గడ్డర్...
ఇదే నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా పిల్లర్లపై ఐరన్ రాడ్లు, సిమెంట్‌తో నిర్మించిన గడ్డర్లను భారీ క్రేన్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో యత్నించారు. అప్పుడు క్రేన్లకు అమర్చిన ఐరన్ రోప్‌లు జారడంతో వందల టన్నుల బరువైన గడ్డర్ నేలకొరిగింది. ఈ ఘటన గత మార్చి 7వ తేదీన జరిగింది. నాడు ట్రాఫిక్ డైవర్షన్ చేసినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన క్రేన్‌కు మాత్రమే నష్టం జరిగింది. ఇలాంటి చేదు అనుభవం ఉన్నప్పటికీ సంబంధిత సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెంటనే నిర్మాణం నిలిపివేయాలని
ఎన్‌హెచ్‌ఏఐ నోటీసులు
లెక్క చేయకుండా
కొనసాగిస్తున్న కాంట్రాక్టు సంస్థ
గతంలో పెను ప్రమాదం
జరిగినా అదే నిర్లక్ష్యం
ట్రాఫిక్ మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు నిర్వహిస్తున్న విషయం మా పరిశీలనలో నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసు జారీ చేశాం. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అనుమతి పొంది ట్రాఫిక్ డైవర్షన్ ఇతర నిబంధనలు పాటించాకే పనులు పునఃప్రారంభించాల్సి ఉంటుంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటాం.
– వికాస్.ఎస్,
ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్‌హెచ్‌ఏఐ


