దయనీయంగా పొగాకు రైతుల పరిస్థితి పర్చూరు నియోజకవర్గంలో భారీగా పేరుకుపోయిన నిల్వలు మార్క్‌ఫెడ్ ద్వారా నామమాత్రంగానే కొనుగోలు చేసిన చంద్రబాబు సర్కార్
గంపెడాశతో సాగు చేసిన పొగాకు నేడు పగాకుగా మారింది. పర్చూరు నియోజక వర్గంలోని సాగు చేసిన రైతులు నేడు అయోమయంలో పడ్డారు. భారీగా పేరుకుపోయిన నిల్వలను ఏం చేయాలో తెలియక.. వాటిని సంరక్షించలేక.. ధర లేక.. ప్రభుత్వం ఆదుకోక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు విషయంలో కూటమి మాటలు తప్ప చేతల్లో విఫలమైంది. మార్క్‌ఫెడ్‌ను రాజకీయంగానే వాడుకుంటోంది. అన్నదాతల కష్టాలను గాలికి వదిలేసింది.
పర్చూరు(చినగంజాం): భారీగా పెట్టు బడులు పెట్టి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా పొగాకు రైతు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. రైతులు పండించిన బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తామని ఊకదంపుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిళ్ల మేరకు తలొగ్గి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టింది. ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న గంపెడాశతో కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతులకు మొండి చేయి చూపించింది. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న మంత్రివర్గ నిర్ణయంతో వారి ఆశలపై నీళ్లు చల్లింది. పర్చూరు నియోజకవర్గ పరిధిలో 30 నుంచి 40 శాతం మాత్రమే పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసింది. అది కూడా పంట నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ నామమాత్రంగా కొనుగోలు చేసింది. రైతుల వద్ద సుమారు 60 శాతానికిపైగా మిగిలి పోవడంతో కాపాడుకోలేక అల్లాడిపోతున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో 2022–23, 2023–24 సీజన్‌లో రైతులు పండించిన పొగాకుకు గిరాకీ వచ్చింది. క్వింటా ధర కనీసం రూ. 16 వేలు నుంచి రూ. 18 వేలువరకు అమ్మకం సాగింది. మిర్చి, శనగ పంటలతో గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో పొగాకు లాభసాటిగా ఉండటంతో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు ఈ సాగు చేపట్టారు. 2024–25 సీజన్‌లో భారీగా సాగు చేపట్టడంతో రైతుల వద్ద నిల్వలు పెరిగిపోయాయి. ప్రభుత్వం అంతంత మాత్రంగానే కొనుగోలు చేపట్టి చేతులు దులుపుకోవడంతో వారు మోసపోయారు.
కొనుగోళ్లలో పక్షపాతం
ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోలు నామమాత్రంగానే సాగింది. గతంలో క్వింటా ధర రూ.18 వేలకు పైగా కొనుగోళ్లు జరగగా... మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం రూ.12 వేలు, రూ. 9 వేలు, రూ.6 వేలు అంటూ మూడు రకాల ధరలు నిర్ణయించారు. పండించిన పొగాకు సంబంధించి రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులను పిలుస్తామన్నారు. కేవలం టీడీపీ నాయకులకు సంబంధించిన రైతులను మాత్రమే పిలిచారు. చిన్న, సన్నకారు రైతులను పక్కన పెట్టడంతో ప్రభుత్వ మోసాన్ని అర్థం చేసుకున్నారు.
ఎదురు చూపులు
ఇప్పుడు క్వింటా కేవలం రూ.5 వేలు పలుకుతోంది. ఆశపడి ముందుకు వెళితే కొనుగోలు సమయానికి దళారులు రూ. 2,500, రూ.3 వేలకు కొనుగోలు చేస్తామంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పొగాకు నిల్వలను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట సీజన్‌లో కచ్చితమైన తేమశాతం, నాణ్యత ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఆకు ఎండిపోయి నాణ్యత తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల కారణంగా నిల్వ ఉంచిన పొగాకు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండెలను కాపాడుకోలేక పట్టలు కప్పి ఉంచడం, తిప్పి వేయడానికి అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడంతో భారం పెరిగింది.


