అధిక ప్రాధాన్యం అభివృద్ధి పనులకు కేటాయింపు
చీరాల: చీరాల మున్సిపాలిటీ బడ్జెట్ 2026–27 సంవత్సరానికి రూ.70.66 కోట్ల అంచనాలతో ఆమోదించారు. గురువారం మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. 2025–26 ముగింపు నిల్వ రూ.21.26కోట్లను 2026–27 ప్రారంభ నిల్వగా చూపారు. రూ.70.66 కోట్లు జమలు అవుతాయని అంచనాలు వేశారు. ప్రారంభ నిల్వతో కలుపుకుని రూ.91.93 కోట్లు కాగా, ఖర్చులు రూ.69.72కోట్లు అవుతాయని అంచనా వేశారు. ముగింపు నిల్వ 2026–27గాను రూ.22.20 కోట్లను చూపారు. 2026–27 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, స్టాంప్ డ్యూటీ, ప్రకటన పన్ను, ట్రేడ్ లైసెన్స్‌లు, షాపుల అద్దెలు, వాటర్ చార్జీలు, పట్టణ ప్రణాళిక, ఇతర ఫీజులు కలుపుకుని రూ.26.51 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. 2026–27 సంవత్సరానికి చేపట్టే అభివృద్ధి పనులకు రూ.48.26 కోట్లు, ప్రభుత్వం నుంచి వివిధ పథకాలపై గ్రాంటుల రూపంలో రూ.44.15కోట్లు మంజూరు రూపంలో ఖర్చు చేయవచ్చని బడ్జెట్‌ను అంచనాలు వేశారు. ఈ బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదాలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ చీరాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. అందుకు తాను ముందుంటానన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: సూర్యలంక బీచ్‌ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు గురువారం కూడా కొనసాగింది. సూర్యలంక బీచ్ అభివృద్ధిపై చర్చ సాగింది. బీచ్ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళిక నివేదికను సీఎంకు అందించారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఓపీ చీటీ తీసుకునేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ గురువారం మీడియాకు తెలిపారు. ఓపీ చీటి కాలవాలనుకునేవారు 95523 00009 నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపిస్తే వాట్సాప్ అందిస్తున్న పలు రకాల వాట్సాప్ సేవలతోపాటు, గుంటూరు జీజీహెచ్ ఓపీ చీటి సేవలు కూడా వస్తాయన్నారు. క్యూలైనులో నిలుచుని ఓపీ తీసుకునే పనిలేకుండా ఏరోజు ఓపీ కావాలని, ఏ డిపార్టుమెంట్‌కు సంబంధించి ఓపీ కావాలి అని వాట్సాప్ ద్వారా రోగులు ముందస్తుగా ఓపీని బుక్ చేసుకోవచ్చన్నారు. సదరు రోగి జీజీహెచ్‌కు వచ్చి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న వివరాలు తెలియజేస్తే తక్షణమే సంబంధిత వైద్య విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చీటి పొందవచ్చన్నారు. ప్రజలు వాట్సాప్ ఓపీ వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ యశశ్వి రమణ కోరారు.


