వివాహేతర సంబంధమే కారణమంటున్న పోలీసులు మృతదేహం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలింపు
బాపట్లటౌన్: మండలంలోని ఈతేరులో కత్తితో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈతేరు గ్రామానికి చెందిన గేరా వెంకటేశ్వర్లు (52), అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ భర్త కట్టా కోటేశ్వరరావు అతనిపై కక్ష పెంచుకున్నాడు. గురువారం ఒంటరిగా కనిపించిన వెంకటేశ్వర్లుపై కూరగాయలు కోసే కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మార్గంమధ్యలోనే అతను మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. రూరల్ సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ పి.జగదీష్‌నాయక్, రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ శ్రీనివాసరావులు పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.


