టెండర్ల ప్రక్రియ జరుగుతోంది
● ఏరియా వైద్యశాల రోడ్డు
మధ్యలో పెద్ద గుంత
● ఆ గుంతను చీరాల పోలవరం
ప్రాజెక్టు అని పిలుస్తున్న ప్రజలు
● సదరు పనులకు గత ఏడాదిలోనే
డీఎంఎఫ్ నిధులు రూ.55 లక్షలు
మంజూరు
● అప్పుడే పరిపాలనాపరమైన
ఆమోదం ఇచ్చిన కలెక్టర్
● నేడు కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో
ఏం జరుగుతుందో....
చీరాల అర్బన్: చీరాలలో తమ దర్పం కోసం పలువురు పాలకులు తప్పులు చేస్తున్నారు. వారి మొప్పు కోసం అధికారులు తందాన అంటున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడి, ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు, నెలకొన్న పరిస్ధితులు అందుకు దర్పణం పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. టీడీపీలోని అంతఃకలహాలా, లేకుంటే మరేదైనా కారణం ఉందో కాని గత రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. ఈ క్రమంలో నేడు మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఎవరి వాణి, ఏవిధంగా వినిపిస్తుందో వేచిచూడాల్సిందే.
ఎవరు పట్టించుకుంటారో..
● చీరాల ఏరియా వైద్యశాల రోడ్డులో గుంత ఏర్పడి ఏడాదికి పైగా అయినా మరమ్మతులు చేపట్టక పోవటం... గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహ సర్కిల్లో మున్సిపల్ అధికారుల హెచ్చరిక బోర్డును ఖాతరు చేయకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకున్న పాలకవర్గం (టీడీపీ వచ్చాక) తమ విధులను సక్రమంగా నిర్వహించక పోవటం... కాలుష్య కాసారంలా మారిన కుందేరులో కనీసం మురుగు నీటి పారుదలకు అడ్డుగా ఉన్న తూటుకాడను తొలగించకపోవడం అలవాటుగా మారింది. ఈ మూడు అంశాలను ఒంగోలు బైపాస్ రైడర్ బస్సుల్లో ప్రయాణించే వారు నిత్యం చూస్తూనే ఉంటారు.
చీరాల పోలవరం ప్రాజెక్టుగా నామకరణం
● ఏరియా వైద్యశాల రోడ్డులో ఏర్పడ్డ గుంతకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఆ గుంతకు చీరాల పోలవరం ప్రాజెక్ట్ అని ప్రజలు ముద్దు పేరు పెట్టారు. అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడో, ఇక్కడ ఈ గుంతను పూడ్చి రోడ్డు వేసేదెప్పుడోనని ప్రజలు మండి పడుతున్నారు.
● సదరు పనికి సంబంధించి డీఎంఎఫ్ (డిస్ట్రక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ.55 లక్షలు గత ఏడాదిలో మంజూరయ్యాయి. అప్పుడే కలెక్టర్ పరిపాలనా పరమైన ఆమోదం ఇచ్చారు. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉన్నా నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
కౌన్సిలర్లు నోరు మెదపరా?
● నేడు కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రెండు నెలల తరువాత జరుగుతోంది. దాదాపు ఇదే చివరి సమావేశం కావచ్చు. కనీసం ఈ సమావేశంలో అయినా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారో, లేదోనని పుర ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏరియా వైద్యశాల రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతంలో 50 మీటర్లు మేర పనిచేశాం. మరో 115 మీటర్లు మేర పని చేయాల్సి ఉంది. అందులోనే ఈ గుంత కూడా ఉంది. ఆ పనులకు గాను డీఎంఎఫ్ నిధులు రూ.55 లక్షలు మంజూరయ్యాయి. కలెక్టర్ పరిపాలనా పరమైనా ఆమోదం ఇచ్చారు. తాత్కాలికంగా ఆ గుంతను పూడ్చటం వల్ల సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆగాం. ఈ పనితో పాటు జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. టెండర్ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టర్‌తో పనులు వేగవంతంగా చేయిస్తాం.
– టి.రఘురామ్,
డీఈ, చీరాల మున్సిపాలిటీ


