ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. 12వ పీఆర్సీపై ఇప్పటికే 30 నెలలుగా నష్టపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు కనీసం పీఆర్సీ కమిటీ నియామకానికి సైతం నోచుకోకపోవడం బాధాకరమన్నారు.
గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వచ్చే ఎన్నికల వరకు కాలయాపన చేస్తామంటే కుదరదని, తద్వారా మరో ఉద్యమం పునరావృతం అవుతుందని హెచ్చరించారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.వేళాంగిణి రాజు మాట్లాడుతూ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటూనే విద్యారంగ సమస్యలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు.
రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు మరిచిపోవడం పరిపాటిగా మారిందని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారని అన్నారు.
ఏపీటీఎఫ్ సీనియర్ నాయకుడు ఏవీ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల చర్యలు బోధనేతర కార్యక్రమాలు, విద్యా వ్యవస్థను తిరోగమనం వైపు తీసుకుని పోతున్నాయని, విద్యలో బోధనేతర కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని నాయకులు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం తగదని, తక్షణమే సమస్యల పరిష్కారానికి రూట్‌మ్యాప్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్ 1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నరసింహారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్–1938 రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు.
ధర్నాలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు వి.సూర్యం, సహాధ్యక్షులు ఓ.నాగార్జున, జిల్లా అదనపు కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జీఎస్‌ఎస్ ప్రసాద్, నగర నాయకులు వై.మనోజ్ కుమార్, ఎన్.మీనాక్షి, వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


