చిలకలూరిపేటటౌన్: ఇటీవల సామర్లకోట వేట్లపాలెంలో జరిగిన బాణసంచా దుకాణాల్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి చిలకలూరిపేట పరిధిలోని బొప్పూడి, చినపసుమర్రు ప్రాంతాల్లోని పలు బాణసంచా హోల్‌సేల్ దుకాణాలు, గోదాములపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పల్నాడు ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు నేతృత్వంలో సుమారు 8 దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.2లక్షల విలువైన బాణసంచా నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉండగా, మెజారిటీ గోదాముల్లో అంతకు మించి భారీగా నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించామన్నారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం ఆయా దుకాణాలకు తాళాలు వేశారు. వీటికి సంబంధించిన మిగిలిన శాఖల జిల్లా అధికారులు, బాణసంచాకు సంబంధించిన నిపుణులను తీసుకువచ్చి నిల్వలను లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ట్రైనీ డీఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా బాణసంచా దుకాణాలు పరిశీలించామని, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతికి మించి అక్రమంగా నిల్వలు ఉంచితే వాటిని వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, ఆర్‌డీఓల సమక్షంలో సమగ్ర తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిల్వలు ఉంచనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అర్బన్ సీఐ పి.రమేష్, రూరల్ ఎస్‌ఐ జి.అనిల్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


