డబ్బు తీసుకుని హుండీని పొలాల్లో పడేసిన దొంగలు
చీరాల టౌన్: చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో దొంగలు పడ్డారు. హుండీలో డబ్బులు తీసుకుని హుండీని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై అంబటి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు...
తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి గుడిలో దొంగలు పడి హుండీని అపహరించారు. అందులోని నగదు తీసుకెళ్లి ఖాళీ హుండీని పొలాల్లో పడేశారనే సమాచారంతో రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్సై చంద్రశేఖర్, వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో గుడి, చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలించారు. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు సుమారు రూ.60 వేల వరకు అపహరణ జరిగిందని కమిటీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగతనం...
ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ముసుగు ధరించిన దొంగ చేతికి గ్లౌజులు ధరించి గడ్డపార తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం ఉన్న గుడి రెండు తలుపులను పగలకొట్టాడు. శఠారి పల్లెంలో
ఉన్న నగదు తీసుకుని పక్కనే ఉన్న హుండీ ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. సోమవారం ఉదయం దేవాలయానికి వచ్చిన పూజారి అమ్మవారి గుడి తలుపులు పగలకొట్టి ఉండటం, హుండీ కనిపించకపోవడంతో కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. కమిటీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది వచ్చి దేవస్థానం సమీప ప్రాంతాలను పరిశీలించారు. సమీపంలోని పొలంలో అమ్మవారి ఖాళీ హుండీ కనిపించడంతో హుండీలోని నగదు తీసుకుని దొంగలు పరారయ్యాడని నిర్ధారించుకుని ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఇదే ఆలయంలో నాలుగేళ్ల క్రితం దొంగలు పడి అమ్మవారి వస్తువులు, హుండీ దోచుకెళ్లారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగలను గుర్తించి జైలుకు కూడా పంపించారు.


