పశువులను ఢీకొన్న టాటా ఏస్ వాహనం ఐదు గేదెలతోపాటు మహిళ దుర్మరణం
చీరాల: చీరాల మండలం విజయనగర్‌కాలనీ సమీపంలో 167ఏ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం రోడ్డుపై వెళుతున్న గేదెలను బలంగా ఢీకొనడంతో ఐదు గేదెలతో పాటు ఒక మహిళ మృతి చెందింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఈపూరుపాలెంలోని సావరపాలేనికి చెందిన సుబ్బమ్మ (64) సోమవారం పశువులను మేపుకునేందుకు విజయనగర్‌కాలనీ సమీపానికి వెళ్లింది. 167ఏ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం రోడ్డుపై ఉన్న గేదెలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ సుబ్బమ్మతో పాటు ఐదు గేదెలు తీవ్రగాయాలతో సంఘటన స్థలంలోనే మరణించాయి. వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
మినీ వాహనం ఢీకొంటేనే ఐదు గేదెలు మరణించాయంటే ఆ వాహనం ఎంత స్పీడుగా వచ్చిందో అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో గేదెలు మేపుకునేందుకు వచ్చిన సుబ్బమ్మ మృతదేహం కూడా నుజ్జయింది. మృతురాలి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


