రేపల్లె: బేతపూడి గ్రామంలో వేంచేసియున్న బేతపూడమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. అమ్మవారికి వేకువ జామునే సుప్రభాత సేవలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించి పట్టువస్త్రాలు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు మేళతాళాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, నూతన వస్త్రాలతో కూడిన సారెతో పాటు చద్ది నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణంలోని పోతురాజు స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగేంద్ర స్వామి పుట్టలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పాలు, గుడ్లు, చలిమిడి సమర్పించారు. ఆలయానికి గ్రామంతో పాటు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయమంతా సందడి వాతావరణం నెలకొంది. ఆలయం ఆవరణంలో నెలకొల్పిన ప్రభలు పలువురిని ఆకట్టుకున్నాయి.


