వాడరేవులో కార్డన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సీజ్
చీరాల: ఆపరేషన్ వజ్రపహార్‌లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాడరేవులో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాడరేవులోని వైఎస్సార్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటుసారా ప్రభావం ఉండేదని, ఈ క్రమంలో పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి నరసరావుపేట: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గురజాల పోలీసులు బేఖాతరు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన ఒక పార్టీ నాయకుడిపై కొంతమంది దాడి చేసిన సంఘటనలో గురజాల పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వారిని పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు హాజరుపరిచారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు రోడ్డుపై నడిపించకూడదనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గురజాల పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు రాజకీయ ప్రముఖులువారి ఆభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


