అశ్లీల ఓటీటీలను నిషేధించిన కేంద్రం
తెనాలిటౌన్: అసభ్యకర, అశ్లీల కంటెంటులను ప్రదర్శిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఇకపై భారతదేశంలో కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించినదని మా– ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వీటికి సంబంధించిన 57 సోషల్ మీడియా ఖాతాలు, 10 యాప్‌లు, 19 వెబ్‌సైట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందన్నారు. స్థానిక మా–ఏపీ కార్యాలయంలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో 13 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఉంకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శృంగార కంటెంటులను 16 ఏళ్ళ లోపు పిల్లలకు దూరంగా ఉంచేలా చట్టం చేయవలసిందిగా ప్రభు త్వానికి ఆయన సూచించారు. ఇక రోగుల ప్రాణాలతో సోషల్ మీడియ చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఒకరు తినగూడదని చెపితే మరొకరు తినొచ్చు అని వీడియోలు పెట్టడం వలన ప్రజలు లేని రోగాలను తెచ్చుకుంటున్నారని దిలీప్ రాజా వాపోయారు. శాశ్వత నివారణ లేని వ్యాధుల ను సైతం తగ్గిస్తామని వైద్యశాస్త్రం చదవని వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పటం వలన ప్రజలకు ఎంత ప్రాణాంతకమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేశారు. సమావేశంలో పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు పాల్గొన్నారు.
మా – ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా


