వర్సిటీ మహిళా ఖోఖో జట్టులో కృష్ణవేణి విద్యార్థినులు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీ అంతర్ కళాశాలల మహిళా ఖోఖో టోర్నమెంట్‌లో తమ కళాశాల చాంపియన్‌గా నిలవటంతోపాటు తమ విద్యార్థినిలు ఎం.శిరీష, ఎం.హేమలత, బి.అలేఖ్య, మడకా చౌడేశ్వరి, కె.అనుషాబాయిలు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారిణిలు త్వరలో కర్నాటక రాష్ట్రం దావణగేరిలో జరగనున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా ఖోఖో టోర్నమెంట్‌లో ఏఎన్‌యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కళాశాల వైస్‌ప్రిన్సిపల్ ఎంఆర్‌కె సతీష్‌బాబు, తిరుపతయ్య, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, కోచ్‌లు సయ్యద్ మహమ్మద్, షేక్ షకీలా, అధ్యాపకులు అభినందించారు.
విక్టరీ కళాశాల విద్యార్థినిలు...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు విక్టరీ కళాశాల చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. వర్సిటీ అంతర్ కళాశాలల టోర్నమెంట్‌లో తమ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలవటంతో పాటు జట్టులోని శ్రీలక్ష్మీ, కృష్ణవేణి, తిరుపతమ్మలు వర్సీటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థినిలను కళాశాల కార్యదర్శి ఒద్దుల సుబ్బారెడ్డి, చైర్మన్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్, పీడీ శ్యాంసన్, అధ్యాపకులు అభినందించారు.


