రైతులకు న్యాయం చేయాలి
భూములు కోల్పోతున్న
అమరావతి: తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణ విధానాలపై రైతులకున్న సందేహాలకు సహేతుకమైన విధానంలో వివరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగాపురం, ధరణికోట గ్రామాలలో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రైతు సంఘాలతో ప్రభుత్వం అవగాహన కార్యక్రమం నిర్వహించి స్పష్టమైన విధానాన్ని తెలియపరచాలన్నారు. ఆయా గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారన్నారు. ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం స్పష్టంగా ప్రకటించలేదని, భూములు కోల్పోతున్న రైతుల పేర్లు, సర్వే నెంబర్లు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. తమ భూమి ఎంతపోతుందో అని ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో ఆరు నెలలు కిందట అధికారులు వచ్చి మాట్లాడటమే తప్ప మళ్లీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. ధరణికోట, లింగాపురం గ్రామాల్లో రైతులతో అభిప్రాయ సేకరణ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, వెంకటేశ్వరరాజు, రైతు సంఘం నాయకుడు దర్శి శేషారావు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, మొహద్దీన్ వలి పాల్గొన్నారు.
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య


