ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి

ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి

● సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.బాబూ ప్రసాద్‌ ● కొనసాగుతున్న రిలే దీక్షలు

లక్ష్మీపురం: ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచి, అంగన్‌వాడీల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే బాబు ప్రసాద్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ వ్యవస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించలేదన్నారు. కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రత చట్టాలు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐసీడీఎస్‌కి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే పేద పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు జి రమణ మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 2న విజయవాడలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాసరావు, షేక్‌ హుస్సేన్‌ వలి, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, లాయర్స్‌ యూనియన్‌ నాయకులు శేషగిరిరావు, డీవీఆర్సీ నాయకులు సురేష్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు జయ శ్రీలక్ష్మి, సుభాషిణి, స్వర్ణలత, రోజమ్మ, యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement