గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి పోస్టర్ విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7,8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రవేశ పరీక్షల కన్వీనర్, గుంటూరు ఏపీ ఆర్.జె.సి (ఉర్దూ బాలురు) కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ఆధ్వర్వంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రామాణిక విద్య, వసతి సౌకర్యాలు కలిగిన ఈ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ–బీ, బీసీ–సీ విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏపీఆర్‌జేసీ సెట్, డీసీ సెట్ 2026 పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.


