ఇంటి స్థలం దరఖాస్తుదారులతో కలెక్టర్ ముఖాముఖీ
చినగంజాం: నాకు భర్త లేడు.. బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నాని ఓ మహిళ కలెక్టర్ ముందు వాపోయింది. మంగళవారం ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులతో కలెక్టర్ వినోద్ కుమార్ ముఖాముఖీ నిర్వహించారు. చినగంజాం మండలం గొనసపూడి గ్రామంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల స్థితిగతులను ఆయన స్వయంగా కలిసి పరిశీలించారు. మండలంలో మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్క గొనసపూడి గ్రామంలో 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామానికి చెందిన మెడబలిమి దానమ్మ దరఖాస్తు చేసుకోవడంతో కలెక్టర్ వారిని స్వయంగా కలిసి మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న విధానం, ఎవరికి చేశారనే విషయం, ఎక్కడ చేశారనే విషయాలను గురించి ఆయన వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తనకు భర్త లేడని, నివాసానికి గృహం లేదని, తనమామ ఇంటిలో తలదాచుకుంటున్నానని, ఎటువంటి ఆస్థిపాస్తులు కూడా లేవని దాంతో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె కలెక్టర్ వివరించారు.
గ్రామంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు సిద్ధం చేయడంతో కలెక్టర్ వాటిని పరిశీలించారు. గ్రామంలో ఇంటి స్థలం కోసం కేటాయించిన ఎల్‌పీఎం సంఖ్య 1179లో భూములు విషయమై ఆర్డీవో టి.చంద్రశేఖర్ నాయుడుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, వీఆర్వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


