గల్లంతైన ఇద్దరు యువకులు మృతి
మృతదేహాలను ఏరియావైద్యశాలకు
తరలించిన పోలీసులు
బాపట్లటౌన్: యార కాలువలో గల్లంతైన ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని అప్పికట్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని మత్స్యపురి కాలనీకి చెందిన వేటగిరి చందు (22), పిట్టలవానిపాలెం మండలం పోతనకట్టవారిపాలెం గ్రామానికి చెందిన పీటా వంశీలు ఈతకొట్టేందుకు సోమవారం యారకాలువలో దిగిన విషయం తెలిసిందే. ఈత కొడుతూ ఇరువురు యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం సోమవారం రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోవడంతో జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్ ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూబోటు, గత ఈతగాళ్లు మంగళవారం ఉదయం నుంచి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి ఇరువురు మృతదేహాలు కాలువ అడుగుభాగంలోని బురదలో కూరుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. అనంతరం ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రూరల్ పోలీసులు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన వారిలో తహసీల్దార్ షేక్. సలీమా, రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, రూరల్ ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు ఉన్నారు.


