లెక్క వీక్‌... ప్రచారం పీక్‌ | - | Sakshi
Sakshi News home page

లెక్క వీక్‌... ప్రచారం పీక్‌

Feb 24 2026 7:16 AM | Updated on Feb 24 2026 7:16 AM

లెక్క

లెక్క వీక్‌... ప్రచారం పీక్‌

శాసనసభ సాక్షిగా చీరాల నియోజకవర్గ చేనేతల సంఖ్యపై ఎమ్మెల్యే కొండయ్య కాకిలెక్కలు నేతన్నలకు ఏడాదికి రూ.25 వేలు ఎప్పుడు ఇస్తారనేది ప్రస్తావించని వైనం ఎమ్మెల్యే కొండయ్య ప్రశ్నలకు, మంత్రి సవిత మొక్కుబడి సమాధానాలు ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యత ఇంకెంత కాలం గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం వెళ్లబుచ్చుతారని ప్రశ్నిస్తున్న నేతన్నలు

సుమారు 4,500 మగ్గాలు ఉంటాయి

చీరాల అర్బన్‌: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కొండయ్య చీరాల నియోజకవర్గంలోని చేనేతల గణాంకాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం, అందుకు మంత్రి సవిత ఆత్మస్తుతి, పరనిందలకు ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటిగా మారింది. మొక్కుబడి సమాధానాలు ఇవ్వడం, నేతన్నలకు ఏడాదికి రూ.25వేలు ఇస్తామన్న హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అటు ఎమ్మెల్యే నోటి నుంచి, ఇటు మంత్రి నోటి నుంచి ప్రస్తావించక పోవటం నిదర్శనమని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.25 వేలు ఎప్పటి నుంచి ఇస్తారు? ఒక వేళ ఇస్తే గడిచిన ఏడాది, ఈ ఏడాదికి కూడా కలిపి ఇస్తారా, అది ఎప్పటి నుంచి అనేది స్పష్టంగా చంద్రబాబు సర్కార్‌ చెప్పాలని నేతన్నలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

వేలాది మంది కార్మికులు

చీరాల నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 50 వేల మంది ఉంటారు. అయితే ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శాసనసభలో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో చేనేతలు 5,214 మంది ఉన్నారని చెప్పారు. అందులో 3,900 మంది మగ్గం పని చేస్తారు. 1,314 మంది చేనేత ఉపవృత్తుల్లో పని చేస్తారని చెప్పారు. చేనేత సొసైటీల సంఖ్య చెప్తూ తడబడ్డారు. బాపట్లలో 71 ఉంటే ..చీరాలలో 41 సొసైటీల ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో చేనేత రంగ ప్రతినిధులు, సగటు చేనేత కార్మికులు నిరంతరం అడుగుతున్న ఏడాదికి రూ.25వేలు ఎప్పటి నుంచి లబ్ధిదారులకు అందజేస్తారనే మాటను ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించలేదు. దీనిపై నేతన్నలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలో చేనేతలు 5,214 మంది ఉన్నారని చెప్పటం హాస్యాస్పదం. నియోజకవర్గంలో కనీసం చేనేతలు ఎంత మంది ఉన్నారనేది కూడా చెప్పలేని వ్యక్తి తమకు ఎమ్మెల్యేగా న్యాయం చేస్తారనుకోవడం తమ అవివేకం అవుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శాలువాలు చేనేతల దరిచేరేనా?

వేంకటేశ్వరస్వామి ఆలయానికి అవసరమైన శాలువాల తయారీ చేనేతలకు అప్పగించటంపై ఎమ్మెల్యే కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ పని చీరాల చేనేతల దరిచేరుతుందా అని స్థానిక నేతన్నలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శాలువాల తయారీ రాయలసీమ ప్రాంతానికే పూర్తిగా సరిపోదని విషయం తెలిసిన వారు అంటున్నారు. ఈ క్రమంలో ఆ అంశం చెప్పి స్థానిక నేతన్నలను మభ్యపెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం లేనట్లే..

ఇదిలా ఉంటే ఎప్పటి నుంచి ఏడాదికి రూ.25వేలు నేతన్నలకు అందజేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. నేతన్నల ఆరోగ్య బీమాకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన అందరికి సమగ్ర హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకానికి చంద్రబాబు అమలు పరుస్తారని చెప్పారే కాని, అది ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చెప్పలేదు. దీంతో చేనేతలకు ప్రత్యేకంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం లేనట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీలో చేనేత సమస్యలు, పరిష్కారంపై ప్రశ్నలు, సమాధానాల తీరు తూతూ మంత్రంగా, నాటకీయంగా ఉందని పలువురు

మండిపడుతున్నారు.

చీరాల నియోజకవర్గ పరిధిలో సుమారు 4,500 మగ్గాలు ఉంటాయి. ఈ సంఖ్య కాస్త అటు,ఇటుగా ఉండొచ్చు. చేనేత ఉపవృత్తులపై ఆధారపడ్డ వారి సంఖ్య డైయింగ్‌తో కలిపి సుమారు 1500 మంది ఉండొచ్చు.

– రఘనంద, హ్యాండ్లూమ్స్‌ ఏడీ, చీరాల

లెక్క వీక్‌... ప్రచారం పీక్‌1
1/1

లెక్క వీక్‌... ప్రచారం పీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement