వలపర్ల వాసికి బంగారు నంది అవార్డు
మార్టూరు: రెండున్నర దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకుగాను మండలంలోని వలపర్ల గ్రామానికి చెందిన సయ్యద్ కరీముల్లా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విశిష్ట బంగారు నంది పురస్కారం అందుకున్నారు. 1988లో గ్రామంలో నేతాజీ విద్యాసంస్థను స్థాపించిన కరీముల్లా వందలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి రెండుసార్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. కరిముల్లా సేవలను గుర్తించిన ఆదర్శ కళానిలయం హైదరాబాద్ వారు జూబ్లీహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బంగారు నంది పురస్కారం అందుకున్నారు. ఆదర్శ కళా నిలయం ఫౌండర్ చీరాల ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రముఖ టెలివిజన్ నటులు, డైరెక్టర్ అశోక్‌రావు, డాక్టర్ రోజా భారతి, టీవీ ఆర్టిస్ట్ నికిత చౌదరిలు కరిముల్లాను సత్కరించి సన్మానించి పురస్కారం అందజేశారు. కరిముల్లాను వలపర్లకు చెందిన పలువురు అభినందించారు
రంగస్థల నటుడు ఏడుకొండలుకు నంది అవార్డు
చినగంజాం: మండలంలోని పెదగంజాం పంచాయతీ ఆవులదొడ్డి గొల్లపాలేనికి చెందిన రంగస్థల నటుడు మద్దిన ఏడుకొండలు యాదవ్‌కు స్వర్ణ నంది 2026 అవార్డు దక్కింది. 22వ తేదీ ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఆనంద కళానిలయం ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ స్వర్ణ నంది అవార్డ్స్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. ఇందులో భాగంగా ఆయనను సత్కరించి స్వర్ణ నంది ప్రతిమ, ప్రశంసాపత్రం అందించారు. ఆవులదొడ్డి గొల్లపాలేనికి చెందిన ఏడుకొండలు యాదవ్ రంగస్థల నటుడుగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య, వీర బ్రహ్మంగా 150 ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా 50 ప్రదర్శనలు, రామాంజనేయ యుద్ధంలో రాముడుగా, కృష్ణుడుగా, చింతామణి నాటకంలో భవానీగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఏడుకొండల యాదవ్ అవార్డు సాధించడం పట్ల పలు నాటక సంఘాలు, మండల, గ్రామ పెద్దలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.
వలపర్ల వాసికి బంగారు నంది అవార్డు


