అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 70 మంది ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నా రు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ సీఐ పి. ప్రభాకర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


