సాయినాథ్‌రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు
నగరం: మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన యువ ప్రతిభావంతుడు అక్కల సాయినాథ్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సుబ్బారెడ్డి – నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయినాథ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అధికారికంగా చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ డిజిటల్ వ్యవస్థలను భద్రపరచడం, సున్నితమైన ఆరోగ్య సమాచారాన్ని రక్షించడంలో చేసిన విశిష్ట సేవలకు ఈ గుర్తింపు లభించింది. ది ఐడియా జెన్ టెక్నాలజీస్ సంస్థ స్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి సాయినాథ్ సైబర్ భద్రత రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో 50కుపైగా భద్రతా లోపాలను గుర్తించి వాటి సవరణకు సహకరించారు. ఎస్‌ఏపీ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం, ఎల్‌జీ సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ ఫ్రా ప్రొటెక్షన్ వారి ద్వారా రెండు సార్లు సత్కారం పొందారు. దేశ డిజిటల్ మౌలిక వసతుల భద్రతకు ఆయన చేసిన సేవలను పలువురు తీరప్రాంతవాసులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం సాయినాథ్ ఐఐటీ హైదరాబాద్‌లోని అస్ట్రామ్ ప్రయోగశాలలో ప్రాజెక్టు సిబ్బందిగా పనిచేస్తున్నారు. 2025లో నిర్వహించిన ఐకేఎంసీ సదస్సులో తన వినూత్న ఆవిష్కరణ ‘మ్రినాళ్’కు ప్రత్యేక ప్రస్తావన పురస్కారం అందుకున్నారు. వెబ్, సైబర్, డ్రోన్ భద్రత, మార్గనిర్దేశక వ్యవస్థలపై నాలుగు పరిశోధనా పత్రాలను ఐఈఈఈ అంతర్జాతీయ సదస్సుల్లో ప్రవేశపెట్టారు. అదనంగా ఐఐటీ మద్రాస్ , ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వర్క్‌షాప్ శిక్షణకర్తగా సేవలందించారు. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, దేశ సైబర్ భద్రత రంగానికి నూతన శక్తిని అందిస్తున్నారు.


