పంట నష్ట పరిహారం కోసం రైతుల ఎదురు చూపు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
రైతుల సంక్షేమం పట్టదని మరోమారు నిరూపితం
మోంథా తుఫాన్ పంటలను నిండా ముంచింది. వరి పొలాలు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారు. ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.25 వేలపైగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందజేస్తామని చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. తరువాత పంట సాగుకు ఆ మొత్తం వస్తుందని రైతులు ఆశపడ్డారు. వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పటికీ పంట నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.
చీరాల అర్బన్: చీరాల మండలంలో మోంథా తుఫాన్ నేపథ్యంలో సుమారు 3 వేల ఎకరాల పైచిలుకు వరి పొలాలు నీట మునిగాయి. అయితే అందులో 1,750 ఎకరాలకు మాత్రమే పంట నష్టపరిహారానికి అర్హత ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేశారు. చీరాల నగర్, బోయినవారిపాలెం, వాద తదితర ప్రాంతాల్లో అసైన్డ్, డీకే, పీఓటీ జాబితాలో ఉన్న భూములు పంట నష్టపరిహారం అర్హత లేదని తేల్చారు. అర్హత ఉన్న రైతులకు కూడా ఆ పరిహారం నేటికీ అందలేదు.
పాలకుల చిన్నచూపు
తుఫాన్ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. పంట నష్టాన్ని అంచనా వేసింది. అయితే కేంద్ర బృందం చీరాలలో పర్యటించలేదు. అప్పుడే రైతులు చీరాలపై అంత చిన్నచూపు ఎందుకని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పాలకులు పట్టించుకోక పోవటమే అందుకు కారణమని మండిపడ్డారు. వర్షాలకు ముంపునకు గురైన వరి పొలాల్లో మరలా వరి సాగు చేశారు. తొలి సారి సాగుకు ఎకరాకు రూ.25వేలకు పైగా ఖర్చు చేశారు. తిరిగి పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారం ఎకరాకు రూ.10వేలు తమ ఖాతాల్లో జమవుతాయని ఆశపడ్డారు. ఇప్పటికీ ఆ పరిహారం అందలేదు. ఎప్పటికి అందుతుందో కూడా స్పష్టత లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాటల్లోనే రైతు ప్రయోజనాలు
చంద్రబాబుకు రైతులు, వ్యవసాయం అంటే ఎప్పుడూ చిన్నచూపే. రైతు ప్రయోజనాల విషయంలో ఆయన మాటలకే పరిమితం అని, అరచేతిలో వైకుంఠం చూపుడంలో ఆయనను మించిన వారు లేరని పలువురు రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికన పంట నష్టపరిహారాన్ని తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
జమ అవుతుంది
పంట నష్టపరిహారానికి సంబంధించి అర్హత ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేసి పంపాం. ఎకరాకు రూ.10 వేల వంతున నష్టపరిహారం ప్రకటించారు. ఆ పరిహారం రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.
– నిర్మలాదేవి, ఏఓ, చీరాల


