కలెక్టర్ బృందం గోవా పర్యటన
బాపట్ల: తీర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా గోవా పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బృందం అక్కడి గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా గురువారం కలిసింది. ఈ సందర్భంగా తీర పర్యాటక అభివృద్ధి, బీచ్ నిర్వహణ, భద్రత చర్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వారు చర్చించారు. బాపట్ల తీరాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గోవా నమూనాలను అనుసరించాలనే సంకల్పాన్ని కలెక్టర్ తెలియజేశారు.
మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
శనగలు, మినుములు, పెసలను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. శనగల కొనుగోలు కేంద్రాలను మార్చి ఒకటో తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించాలని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 20 రైతు సేవ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి 12,116 క్వింటాళ్ల శనగలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. ఒక రైతు 40 క్వింటాళ్ల శనగలను ఒక రోజులోనే కొనుగోలు కేంద్రం వద్ద అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్ ఏడీ కరుణశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, పౌర సరఫరాల సంస్థ జీఎం శ్రీలక్ష్మి, జిల్లా రవాణా అధికారి పరంధామరెడ్డి, కమిటీలను సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బృందం గోవా పర్యటన


