సత్వర పరిష్కారమే లోక్ అదాలత్ లక్ష్యం
న్యాయవాదుల సమావేశంలో జిల్లా జడ్జి
బాపట్ల : ప్రజలు, కక్షిదారులు, కోర్ట్ కేసులు సత్వర పరిష్కారం చేసుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ దోహదపడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి కె. శ్యాంబాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ ఆసోసియేషన్ హాల్‌లో గురువారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కలిగించి, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. న్యాయవాదులు వారి వద్ద ఉన్న కక్షిదారులకు విషయం చెప్పాలని కోరారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కేసుల పరిష్కారంలో రెండుసార్లు ప్రథమ స్థానం సాధించిందని గుర్తుచేశారు. ఈసారి కూడా అత్యధిక కేసులు పరిష్కరించుకొని హ్యాట్రిక్ సాధించాలని కోరారు. గతంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 1085 కేసులు జిల్లాలోని ఆయా కోర్టులలో పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. సీనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి వాణి, అడిషనల్ సివిల్ జడ్జి ఎం. పవన్ కుమార్, జూనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎం. కల్యాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.అవినాష్, ఏజీపీ గవిని శ్రీనివాసరావు, న్యాయవాదులు ఆర్. వెంకటేశ్వరరావు, నంబూరి నరసింహారావు, నల్లమోతు సుబ్బారావు, దుద్దుకూరు భాస్కరరావు, భీమా లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


