మహిళలకు చదువే వజ్రాయుధం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
బాపట్ల: డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితోపాటు కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్రలో గురువారం నిర్వహించిన ‘అందరికీ విద్య మనందరిదీ బాధ్యత‘ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతోపాటు చదవడం, రాయడం నేర్పించాలని వారికి బుక్స్‌ను ఇంటికి పంపించాలన్నారు. మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. చదువు ప్రాముఖ్యతను మహిళలకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మహిళలను కలెక్టర్ ప్రశ్నించగా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు. మీరు చెప్పిన సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మారతమ్మ, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదనరెడ్డి, మనోరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పన్నుల వసూళ్లలో జిల్లాను
ప్రథమస్థానంలో నిలపాలి
వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా సమష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పన్నులు పెండింగ్ లేకుండా రావాలన్నారు. జీఎస్టీ పన్నుల రూపంలో బాపట్ల జిల్లా నుంచి రూ.35 కోట్లు వసూలు జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ పన్నుల పెంపుదలకు ట్రేడ్ లైసెనన్స్‌ల జాబితాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ అరియర్స్ పన్నుల వసూలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. ప్రతి నెలా జీఎస్టీ పన్నుల వసూలు లక్ష్యం, వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. గ్రానైట్, అనుబంధ పరిశ్రమల నుంచి పన్ను ఎగవేతదారులను అరికట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ మురళీకృష్ణ, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి
గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక న్యూ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ మాట్లాడారు. ఉద్యోగస్తుల డిప్యూటేషన్లు, ఓడీల వివరాలను ఈ ఆఫీసులో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పి.గ్లోరియా, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, డీపీఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


