రైతులు పంట నమోదు చేసుకోవాలి
15వ తేదీలోపు
జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల
చెరుకుపల్లి: ప్రతి రైతు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నూతనంగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ యాప్‌లో పంట నమోదు చేసుకోవచ్చని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తెలిపారు. గురువారం మండలంలోని గూడవల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలసి పంట నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోపు తాము సాగు చేసిన వివిధ పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా లేదా ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. అనంతరం ఫార్మర్ యాప్‌ను నమోదు చేసుకునే పద్ధతిని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎ.లక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారి డి.వెంకటరామయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి.ఫరూఖ్, గూడవల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు ఎ,నరేంద్ర, ఏఈవో రామకృష్ణ, వీఏఏ శివసాయి తేజ, గ్రామ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


