రసకందాయంగా చీరాల రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రసకందాయంగా చీరాల రాజకీయం

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

రసకందాయంగా చీరాల రాజకీయం

రసకందాయంగా చీరాల రాజకీయం

రసకందాయంగా చీరాల రాజకీయం

మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంతో..

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై విష ప్రచారం..

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీ గూటికి చేరేందుకు పలువురు ఆసక్తి

ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంలతో మాటామంతీ..!

మెజార్టీ ఉన్నా మున్సిపల్‌ కౌన్సిల్‌

సమావేశాల నిర్వహణలో టీడీపీ చైర్మన్‌ విఫలం

పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్య వైఫల్యమే ఇదని ప్రచారం

చీరాల అర్బన్‌ (చీరాల): చీరాల రాజకీయం రసకందాయంగా మారింది. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎప్పుడు ఎవరు వెళ్తారో ఊహించలేని స్థితి. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక పలువురు వైఎస్సార్‌ సీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అందులో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకొనేందుకు అప్పట్లో టీడీపీ వర్గాలు కృషి చేశాయనే ప్రచారం జరిగింది. ఇది మున్నాళ్ల ముచ్చటగా మారింది. టీడీపీ పక్షాన ప్రస్తుతం సింహభాగం కౌన్సిలర్లు ఉన్నా జనవరి నెలలో కనీసం మున్సిపల్‌ సాధారణ, అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వైఫల్యమేనని వాదనలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మళ్లీ వెనక్కి వచ్చే ఆలోచన..

వైఎస్సార్‌ సీపీని వీడి టీడీపీ గూటికి చేరిన కౌన్సిలర్లలో పలువురు తాము తొందరపాటు నిర్ణయం తీసుకున్నామనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంత కాలంగా వారు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలతో తిరిగి సయోధ్య కుదుర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు బహిరంగంగా, మరికొందరు సందర్భానికి అనుగుణంగా కలుస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే వైఖరే కారణం..

కౌన్సిల్‌లో స్వపక్షానికి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నా కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించలేని స్థితికి మున్సిపల్‌ చైర్మన్‌ ఉండటమనేది, పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్య వైఫల్యమేనని వాదనలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఆ వాదనలును కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రతినెలా జరగాలి. అవసరమైతే మధ్యలో అత్యవసర సమావేశాలు, టేబుల్‌ అజెండాలతో కూడా కౌన్సిల్‌ సమావేశాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భాల్లో మున్సిపల్‌ పరిధిలో సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, సమీకరణ, వివిధ శాఖల అఽధికారుల పనితీరు, లోటుపాట్లు, తదితర అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజెండాలోని అంశాలకు సంబంధించి వాదనలు ఉంటాయి. అవసరమైతే ఓటింగ్‌ ద్వారా ఆమోదిస్తుంటారు. ఆ ప్రక్రియ జరగక పోవడం కౌన్సిల్‌ గౌరవాన్ని, పురప్రజలను చిన్నచూపు చూసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సందర్భాన్ని బట్టి వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలు క్యాడర్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో తలలో నాలుకలా ఉంటారు. ఈ క్రమంలో నాలుగు రోజులు క్రితం పలువురిని మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారిలో వైఎస్సార్‌ సీపీని వీడి టీడీపీ గూటికి చేరినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు తాము గెలిచింది వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తుపై అని, పరిణామాల క్రమంలో పక్కటడుగు వేశామని, అవసరమైతే సరిదిద్దుకుని మరలా సొంత గూటికి వస్తామని.. తమ సన్నిహితులతో అటుండటం విశేషం. తాజాగా బుధవారం చీరాల్లో పలు కార్యక్రమాలకు హాజరైన బలరాంతో పలువురు అదే పంథాతో నడవడం కనిపించింది. ప్రస్తుతం ఈ అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌లో భాగంగా రీ సర్వేకు సంబంధించి చంద్రబాబు, కూటమి వర్గాలు విషప్రచారాలు చేశాయి. ఎవరి ఆస్తులు వారికి దక్కవని గోబెల్స్‌ ప్రచారం చేశాయి. దీంతో ఆనాటి పరిణామాల క్రమంలో చీరాల్లో ఓ సామాజికవర్గం ఎన్నికలకు కేవలం ఐదారు రోజులు ముందు వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంది. అది రాష్ట్ర కమిటీ పిలుపేనని ఆ సామాజికవర్గానికి చెందిన వారు అంతరంగికుల వద్ద చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో సుమారు 19 వేల ఓట్లకు గండి పడింది. అలానే ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఆ ప్రభావం గణనీయంగా పడింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగింది. అదే సామాజికవర్గానికి చెందిన వారిలో పలువురు తాము విష ప్రచారానికి మోసపోయామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలను చేకూర్చిన వారిని విస్మరించామనే పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు వేస్తున్న అడుగులు అందుకు దర్పణం పడుతున్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement