అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
కారంచేడు: ఎప్పటిలానే అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన మూడు సంవత్సరాల బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ అపస్మారకస్థితికి చేరుకుని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. కారంచేడు మండలం రంగప్పనా యుడువారిపాలెం పంచాయతీ శివారు గ్రామం నందిగుంటపాలేనికి చెందిన పల్లపోతుల రాంబాబు–సువార్త దంపతులకు 4 సంవత్సరాల దీపిక, 2 సంవత్సరాల మూడు నెలల రోహిత్ సంతానంగా ఉన్నారు. వీరు అదే ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంటారు. బుధవారం ఉదయం కూడా వెళ్లగా, బాలుడు రోహిత్ మధ్యాహ్న సమయంలో ఏడుస్తుండగా తల్లి వచ్చి అంగన్‌వాడీ సిబ్బందిని అడిగింది. బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో కాలి మడమ, చిటికెన వేలికు చిన్న ముల్లు గుచ్చుకుని ఉన్నట్లు గమనించి మందు రాశానని సిబ్బంది చెప్పారు. ఏడుపు ఆపకుండా ఉండటంతో పాటు అపస్మారకస్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే చీరాల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. బాలుడికి ఏమైనా పాము కరిసిందా, ఇంకై మైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరిపించాలని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్‌ఐ ఖాదర్‌బాషా తెలిపారు. బాలుడి మృతితో నందిగుంటపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు


