శ్లాబ్ పెచ్చులూడిపడి మహిళకు తీవ్ర గాయాలు
కొల్లూరు: అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలో మంచంపై నిద్రిస్తున్న మహిళపై కాలం చెల్లిన ఇంటి పైకప్పు పెచ్చులూడిపడి తీవ్ర గాయాల బారిన పడిన సంఘటన కొల్లూరు గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గాంధీనగర్‌కు చెందిన మాగం శ్రీనివాసరావు భార్య వెంకటేశ్వరమ్మ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది. బుధవారం మధ్యహ్నం ఆమె ఇంటిలో నిద్రిస్తుండగా ఉన్నట్లుండి దశాబ్ధాల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఇంటి శ్లాబ్ నుంచి భారీ పెచ్చు ఊడి కిందపడింది. నిద్రిస్తున్న వెంకటేశ్వరమ్మపై పడటంతో ఆమె తీవ్రంగా గాయపడటంతోపాటు, ఆమె నిద్రిస్తున్న మంచం సైతం ధ్వంసమైంది. ఇంటి పైకప్పు పెచ్చులు పడటంతో గాయాలపాలైన ఆమె కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆమెను తెనాలి వైద్యశాలకు తరలించారు.
శ్లాబ్ పెచ్చులూడిపడి మహిళకు తీవ్ర గాయాలు


