మనస్తాపంతో మహిళ బలవన్మరణం
కారంచేడు: భర్త కాపురానికి తీసుకెళ్ళడం లేదని, తన బిడ్డ భవిష్యత్తు ఏంటో అని మనస్తాపం చెందిన మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం మండలంలోని ఆదిపూడిలో జరగగా కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు. ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ పాండురంగ, కృష్ణవేణి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానంగా ఉన్నారు. కుటుంబం అంతా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కుమార్తె కోకిల (25)ను ఐదు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మద్దెల నాగసాయి ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి చరణ్‌కౌశిక్ అనే మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. కాగా 10 నెలల క్రితం భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో నాగసాయి ప్రవీణ్‌కుమార్ తన భార్య అయిన కోకిలపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె తన బిడ్డను తీసుకొని పుట్టింటికి (ఆదిపూడి)కి చేరింది. ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై ఆమె కొన్ని రోజులుగా మనోవేదనతో ఉంది. ఈ క్రమంలో బుధవారం తల్లిదండ్రులు, తమ్ముడు పొలం పనులకు వెళ్ళగా బిడ్డను బంధువుల ఇంటి వద్ద ఉంచి ఆమె ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రానికి వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల తరలించారు.


