అల్లూరికి సహకరించిన బ్రిటిష్ ఉద్యోగులు
మార్టూరు: బ్రిటిష్ ఉద్యోగులు అయి ఉండి కూడా స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సహకరించిన ఫజలుల్లాఖాన్, షేక్ మదీనాల చరిత్రను వెలుగులోకి తీసుకువస్తూ రచించిన పుస్తకాన్ని బుధవారం మార్టూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్ )రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ బాష మాట్లాడుతూ ఫజలుల్లాఖాన్ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూనే రంప ఏజెన్సీలో భారతదేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు చేస్తున్న సాయుధ పోరాటానికి సహకరించారన్నారు. అదే ప్రభుత్వంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన షేక్ మదీనా ఉద్యోగ విరమణ అనంతరం అల్లూరికి తుపాకీ కాల్చడం నేర్పించి హిందూ, ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని కొనియాడారు. వీరి చరిత్రను ‘అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా’ పేరుతో సయ్యద్ నజీర్ అహమ్మద్ రచించిన పుస్తకాన్ని గోగుల మూడిరాధా కృష్ణ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ఆవిష్కరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల కన్వీనర్ దేవరపల్లి రాము, ఏసురత్నం, ఖాజావలీ ఖాన్, బాబు ఖాన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
‘అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా’ పుస్తకావిష్కరణలో వక్తలు


