పొట్టి శ్రీరాములు జీవితం యువతకు ఆదర్శం
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. అమరజీవి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఘనుడు అమరజీవి అన్నారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, గాంధేయవాదిగా మహాత్మా గాంధీ సత్యం–అహింస సిద్ధాంతాలను అమరజీవి జీవితాంతం ఆచరించారన్నారు. ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ, వాటన్నింటినీ త్యాగం చేసి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో విశేష పాత్ర పోషించారని, రాజకీయ పదవులు గానీ, వ్యక్తిగత లాభాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపకుండా ప్రజల హక్కుల కోసమే నిరంతరం పోరాటం సాగించారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఆశయంతో ఆయన చేసిన పోరాటం చరిత్రాత్మకమన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 1952 అక్టోబర్ 19న మద్రాసు (చైన్నె)లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. 58 రోజుల పాటు కొనసాగిన ఆ దీక్షలో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, చివరకు డిసెంబర్ 15న తెలుగు ప్రజల కల సాకారం కావాలని కోరుకుంటూ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన మరణానంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన త్యాగమే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు బాటలు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ పి.బాల మురళీకృష్ణ, ఏఆర్ డీఎస్పీ పి.విజయసారధి, ఏఓ బి.శ్రీనివాసరావు, ఆర్.ఐ షేక్ మౌలుద్దీన్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


