సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్‌డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్‌డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అదే బాటలో ఆయన కుమారుడు శ్రీ వశిష్ట సోమే పల్లి పయనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఇద్దరి రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు సిఫార్స్ చేయగా, ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. సుందరయ్య కాలనీ ఐదో వీధిలో ఉంటున్న షేక్ బాజీ అలియాస్ సిరిపురం బాజీపై నల్లపాడు పీఎస్‌లో ఏ కేటగిరి రౌడీషీట్, ఐదు కేసులు నమోదై ఉన్నాయన్నారు. రామిరెడ్డితోట ఒకటో వీధికి చెందిన 19 ఏళ్ల షేక్ సమీర్ అలియాస్ ఫైజల్‌పై కొత్తపేట పీఎస్‌లో ఏ+రౌడీషీ ట్, రెండు హత్య కేసులు సహా పది కేసులు ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్ బాజీ తరచూ హింసాత్మక ఘటనల్లో ఉంటూ, ప్రజా శాంతికి, స్వేచ్ఛకు భంగం స్పష్టించేలా ప్రవర్తించేవాడని, మరో రౌడీషీటర్ సమీర్ బాల్యం నుంచే నేర జీవితానికి అలవాటుపడ్డాడని తెలిపారు. దోపిడీ, దొంగతనం, హత్యలకు సంబంధించి వరుస హింసాత్మక, చట్ట విరుద్ధమైన తీవ్ర నేరాల్లో పాల్గొనేవాడని వివరించారు. ఇద్దరు నిరంతరం నేరాల్లో జోక్యం చేసుకునేవారని, పలు కేసులు నమోదై, జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించిన వారిలో మార్పు రాలేదని తెలిపారు. ఈ క్రమంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వారిపై పీడీ చట్టం ప్రయోగించామని ఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా పీడీ చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


