రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన ట్రక్కు
●తీవ్రగాయాలు
●నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు
బల్లికురవ: పొలం వెళ్లేందుకు రోడ్డు దాడుతున్న మహిళను రోడ్డు అభివృద్ధి పనులు చేసే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం మేదరమెట్ల–నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని బల్లికురవ మండలంలోని ఎస్‌ఎల్ గుడిపాడు గ్రామంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏటి సంపూర్ణ గ్రామంలో నుంచి పడమర వైపు పొలాలకు వెళుతోంది. రోడ్డు అభివృద్ధి పనుల పేరిట రామాంజనేయపురం నుంచి ఎస్‌ఎల్ గుడిపాడు వరకు ఒకవైపుకు ట్రాఫిక్ మళ్లించారు. ట్రక్కు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రురాలిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుంది. నామ్ రహదారిపై తరచూ మరమ్మతుల పేరిట ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ బారిగేట్లు, స్టాపర్లు అడ్డుపెడుతూ ప్రమాదాలు సంభవించేలా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటపాటు గుడిపాడు గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ నామ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. రెండు వైపుల వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న ఎస్సై వై. నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులకు నచ్చచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


