గంగపుత్రులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
బోట్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు
నిజాంపట్నం: గంగపుత్రులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిజాంపట్నం బోట్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ నిజాంపట్నం ఆధ్వర్యంలో మత్స్యకారుల వేట – దిశ నిర్దేశం అంశంపై తుఫాన్ షెల్టర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మత్స్య సంపద కోసం సముద్రంలోకి వేటకు వెళ్ళిన మత్స్యకారులు రోజుల తరబడి వేటను కొనసాగించాల్సి ఉంటుందన్నారు. వేటకు వెళ్ళే సమయంలో ఆహార పదార్థాలు, ప్రథమ చికిత్స కిట్లను తప్పనిసరిగా తీసుకెళ్ళాలన్నారు. ఎటువంటి అనారోగ్యం తలెత్తిన వెంటనే తీరానికి చేరుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా తమతో పాటు మైరెన్ సిబ్బందికి సమాచారం తెలియజేసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను సైతం తీసుకెళ్ళాలని సూచించారు. విపత్తుల సమయంలో అధికారులు సమాచారం అందిస్తే వేటకు వెళ్ళిన మత్స్యకారులు త్వరితగతిన తీరం చేరుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. కొంత మంది మత్స్యకారులు గమ్యం మారి మన పరిధిని దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళి పడే ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్ళే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో నిర్వహించే ప్రాథమిక చికిత్సలు, విపత్తుల సమయంలో అధికారుల నుంచి వచ్చే సమాచారం తదితర అంశాలపై మైరెన్, వైద్య అధికారులు మత్స్యకారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో కోస్ట్‌గార్డ్ కమాండర్ రాజేందర్ స్వరూప్, అసిస్టెంట్ కమాండర్ వీవీఎన్‌వీ ప్రసాద్, డాక్టర్ సమీరా, మైరెన్ సీఐ ఏవీ సురేష్, ఫారెస్ట్ అధికారి ఎం.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


