ఓవరాల్ చాంపియన్ అంగలకుదురు జెడ్పీ హైస్కూల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్స్ అసోసియేషన్ అఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా క్రాస్ కంట్రీ పోటీల్లో అంగలకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్ కై వసం చేసుకున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ టైటిల్ సాధించిన టీంకు ట్రోఫీతోపాటు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 24న కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా టీం పాల్గొంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పాన్సర్ కొరత ఉందని, కంపెనీలు ముందుకు వచ్చి క్రీడాకారులను దత్తత తీసుకుంటే రాబోవు రోజుల్లో గుంటూరు నుంచి అంతర్జాతీయ చూడగలమని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఏవీ ఆంజనేయులు, అరుణ్‌కుమార్, శాప్ కోచ్‌లు శివారెడ్డి, వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్లు వి.శరత్‌బాబు, అంజి, నాగరాజు పాల్గొన్నారు.


