
మద్యం విక్రయాల పెంపునకు ‘పర్మిట్’
దుకాణాల వద్ద పర్మిట్ రూములకు కూటమి ప్రభుత్వం అనుమతి
మద్యం ఆదాయంపైనే దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ఇప్పటివరకు బార్లకు మాత్రమే పరిమితమైన సిట్టింగ్.. ఇక వైన్స్‌లోనూ ‘పర్మిట్ రూం’ పేరుతో ఏర్పాటు చేసుకునేలా కూటమి పాలకులు వెసులుబాటు కల్పించారు. ఈ సాకుతో రూ.కోట్లలో వ్యాపారుల నుంచి ఫీజుగా వసూలు చేయనున్నారు. పరోక్షంగా ఈ భారం మళ్లీ ప్రజలపైనే పడనుంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మద్యం ఏరులై పారించేందుకు కూటమి ప్రభుత్వం గేట్లు ఎత్తేసింది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు దుకాణాలు కట్టబెట్టి రూ. వేల కోట్ల రాబడి పొందుతోంది. ఇది చాలదన్నట్లు ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతోంది. ఇప్పుడు వైన్స్ వద్ద పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిలిచ్చింది. ఇప్పటికే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారులు మద్యం విక్రయాలు పెంచుకుంటున్నారు.
అందినకాడికి పిండేస్తున్న పాలకులు
వార్షిక లైసెన్సు ఫీజులు కట్టడానికి మద్యం వ్యాపారులు వాడవాడలా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పర్మిట్ రూముల పేరుతో చంద్రబాబు సర్కార్ వసూళ్లు మొదలుపెట్టడంతో ఆ భారం మళ్లీ ప్రజలపైనే పడనుంది. ప్రతిమద్యం దుకాణం వద్ద కూర్చొని మద్యం తాగేందుకు ప్రభుత్వం పర్మిట్ రూములు తప్పనిసరి చేసింది. ఇందుకు ప్రత్యేకంగా రిటైల్ ఎకై ్సజ్ సుంకం పేరుతో భారీగా వడ్డనకు సిద్ధమైంది. రూ. 55 లక్షలలోపు వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించే మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌కు రూ. 5 లక్షలు లైసెన్సు ఫీజు నిర్ణయించింది. రూ. 65 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు వార్షిక లైసెన్సు రుసుము ఉన్న దుకాణాలకు రూ.7.50 లక్షలు ఫీజుగా తేల్చింది. ఈ మొత్తం నవంబర్ 10వ తేదీ నాటికి ఒకే విడతలో చెల్లించాల్సి ఉంటుంది.
బాదుడే బాదుడు...
జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేమూరు, నగరం, చీరాల, పర్చూరు, అద్దంకి ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 129 మద్యం దుకాణాలు ఉన్నాయి. రూ. 55 లక్షల వార్షిక లైసెన్సు రుసుము చెల్లించే దుకాణాలు 42 కాగా, రూ. 65 లక్షల నుంచి రూ.85 లక్షల వార్షిక ఫీజు చెల్లించే దుకాణాలు 86 ఉన్నాయి. వీటిలో పర్మిట్ రూముల లైసెన్సు ఫీజు కింద ప్రభుత్వానికి ఏడాదికి రూ. 8.50 కోట్లు అదనపు రాబడి సమకూరనుంది. ఈ దుకాణాలలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 12 దుకాణాలు మినహా మిగిలిన వాటిలో 90 శాతం దుకాణాల వ్యాపారులు విక్రయాలు పెంచుకునేందుకు వాడవాడలా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వైన్స్‌లో మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ. 20 నుంచి రూ.50 వరకూ అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణాల వద్ద ధరలు మరింత అదనంగా ఉన్నాయి.
జిల్లాలో మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహిరంగ మద్యపానం పెరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించి ఈ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 10వ తేదీ నాటికి ఒకే విడతలో ఫీజు చెల్లించాలి.
– బి.వెంకటేశ్వర్లు,
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి
కూటమి నేతలు మాటలకే పరిమితం
మద్యం అమ్మకాలపై 20 శాతం ప్రాఫిట్ పర్సంటేజీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తర్వాత 8 శాతం కమీషన్‌తో సరిపెట్టింది. నష్టాల్లో కూరుకుపోతున్నామని నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో పర్సెంటేజీ 14 శాతానికి పెంచి చేతులు దులుపుకొంది. ఇప్పటికే స్థానిక పచ్చ నేతలకు ఎంతో కొంత ముట్టజెబుతూ పర్మిట్ రూములు అనధికారికంగా వ్యాపారులు ఏర్పాటు చేశారు. బహిరంగంగా మందు బాబులు దుకాణాల వద్దే మద్యం తాగడంపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ కూటమి ప్రభుత్వం ఇలా వసూళ్లకు దిగింది. గత ప్రభుత్వంలో మద్యం విధానాన్ని తప్పుపట్టిన కూటమి నేతలు.. బెల్టు దుకాణాలు లేకుండా కట్టడి చేస్తామని ఊదరగొట్టారు. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు దుకాణాల వద్దే పర్మిట్ రూముల పేరుతో మందు తాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.