
వరద ఉధృతం
రేపల్లె: ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో లంక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన పెనుమూడి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత గ్రామాలైన పెనుమూడి, పెనుమూడి పల్లిపాలెం, రావి అనంతవరంలలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వరద ఉధృతి పెరిగితే ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలో భాగంగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు. గురువారం 12 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి 5.52 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. రేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఏదైనా సహాయం కోసం 77 94 89 45 44 నంబరులో సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
రైతుల్లో కలవరం
భట్టిప్రోలు: కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతుండడంతో లంక గ్రామాల రైతులు కలవరపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు గురువారం ఉదయం 3.97 లక్షలు, సాయంత్రం 5.65 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పెదపులివర్రు, గొరిగపూడి, రేపల్లె ప్రాంతాలకు చెందిన రైతులు పసుపు, కంద, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వరద ఉధృతికి పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పరిస్థితిని తహసీల్డార్ మేకా శ్రీవాసరావు, డెప్యూటీ తహసీల్డార్ శాంతకుమారి, ఎంపీడీవో ఎస్‌వీ రమణ, ఇన్‌చార్జి ఆర్‌ఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో వీఆర్వోలు మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్, రాంబాబు, పంచాయతీ సిబ్బంది, వీఆర్‌ఏలు సమీక్షిస్తున్నారు.
లంక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకువస్తుంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునగ, దొండ, బొప్పాయి పంటలు నీటిలో నానుతున్నాయి. ఇటుక బట్టీలు నీట మునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
● లంక గ్రామాల ప్రజలను
అప్రమత్తం చేస్తున్న అధికారులు
● అందుబాటులో బోట్లు, గజ ఈతగాళ్లు
కొల్లూరు: కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజలను వరద భయం పట్టి పీడిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు గురువారం 5 లక్షల 65 వేల 201 క్యూసెక్కులు విడుదల చేశారు. గాజుల్లంక చినరేవు నుంచి వచ్చిన వరద నీరు మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు చెందిన ప్రజలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం వీరు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, కొల్లూరు మండలం గాజుల్లంక మీదు గా చుట్టూ తిరిగి ప్రయాణం సాగిస్తున్నారు. అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంక సమీపంలోని గండి, గాజుల్లంక గ్రామం వెంబడి నది గట్టుకు గండ్లు ఏర్పడ్డాయి. వరద నీరు ఇటుకరాయి మట్టి కోసం తవ్విన గుంతల్లోకి చొచ్చుకొని రావడంతో ఆ మూడు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మండలంలోని చింతర్లంకలో నది అంచున ఉన్న లోతట్టు పంట భూముల్లోకి వరద నీరు చేరడంతో అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి. పోతార్లంక –గాజుల్లంక గ్రామాల నడుమ కంద, అరటి, పసుపు, కూరగాయల పంటలను వరద ముంచెత్తింది. కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలు నీట మునిగాయి.

వరద ఉధృతం

వరద ఉధృతం

వరద ఉధృతం

వరద ఉధృతం