
పోరాటానికి, క్రమశిక్షణకు మారుపేరు యూటీఎఫ్
యూటీఎఫ్ సీనియర్ నాయకుడు జోజయ్య
గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటానికి, క్రమశిక్షణకు యూటీఎఫ్ మారుపేరుగా నిలిచిందని యూటీఎఫ్ సీనియర్ నాయకుడు కె.జోజయ్య అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ 52వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించిన జోజయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ నిజాయతీకి, త్యాగానికి నిలయం అన్నారు. ఆవిర్భావం మొదలు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సంఘాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
●మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ సంస్కరణల రూపకల్పనలో అకడమిక్ అంశాలతో పాటు, ఉపాధ్యాయుల కృషి, సమాజ భాగస్వామ్యంలో రావలసిన మార్పులపై దృష్టి పెట్టాలని అన్నారు.
●మరో సీనియర్ నాయకుడు జి.ప్రభుదాస్ చెన్నుపాటి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ యూటీఎఫ్‌లో పని చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తల్లో ఆ స్ఫూర్తి ఉంటుందన్నారు.
కార్యక్రమంలో సంఘ జిల్లా సహధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సీపీఎస్ కన్వీనర్ సీహెచ్ ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బి. ప్రసాదు ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్ రాష్ట్ర కౌన్సిలర్ బి.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.