
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
నలుగురికి తీవ్ర గాయాలు
భట్టిప్రోలు: కృష్ణా జిల్లా పామర్రు సమీపంలో ఆదివారం జరిగే సంబరాలకు వెళుతుండగా వాహనం ప్రమాదానికి గురై నలుగురికి గాయాలయ్యాయి. భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామానికి చెందిన కొంత మంది కృష్ణాజిల్లా పామర్రు సమీప గ్రామంలోని అమ్మవారికి పసుపు, కుంకుమలు చెల్లించడానికి వాహనంలో బయలుదేరారు. వాహనం వేమవరం వంతెన వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక వైపు డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో వెనుక వైపు డోర్‌పైన కూర్చున్న నలుగురు కింద పడిపోయారు. బాధితులు గుర్రం శ్రీనివాసరావు, మోర్ల వెంకయ్య, జొన్నా రత్తయ్య, వెంకటేశ్వరరావులను భట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకురాగా సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు.