
ఫుట్‌బాల్ లీగ్ విజేతగా బాపట్ల జిల్లా జట్టు
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లమల జోన్ (బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు) జిల్లాల సీనియర్ ఫుట్‌బాల్ లీగ్ పోటీల్లో బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం చీరాల్లోని ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో నల్లమల జోన్‌లోని నాలుగు జిల్లాలకు ఫుట్‌బాల్ లీగ్ పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించిన బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ జట్టు ప్రకాశం జిల్లా జట్టును ఫైనల్లో నిలువరించి విజేతగా నిలిచింది. దీంతో నిర్వాహకులు ఈనెల 16, 17 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు బాపట్ల జల్లా జట్టును ఎంపిక చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి పోటీలకు, సంతోష్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని నల్లమల జోన్ కోఆర్డినేటర్ నూతలపాటి దేవదాసు తెలిపారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంప్ ఇన్‌చార్జ్ బి. ప్రేమయ్య, ఎన్. నరేష్, ఎన్. బాలశౌరి, ప్రసన్న, మున్సిపల్ కౌన్సిలర్ ఎస్. సత్యానందం పాల్గొన్నారు.