
ఉచితం సరే.. అసలు బస్సే లేదే!
ఎన్నికలకు ముందు నుంచీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చంద్రబాబు ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. ఆ పథకం అమలు సంగతేమోగానీ.. మా ఊళ్లకు కనీసం బస్సు నడిస్తే చాలని బల్లికువర పరిధిలోని ప్రజలు వాపోతున్నారు. అలాగే స్థానిక బస్టాండును పునరుద్ధరించి తమ ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
బస్సు వసతి కల్పించండి
మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలకు మేము వెళ్లేందుకు మాకు ఆర్టీసీ బస్సు వసతి కల్పించాలి. ప్రస్తుతం చిలకలూరిపేట డిపో నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులకు బస్సు రావటం లేదు. అద్దంకి డిపో నుంచి బల్లికురవ, ఉప్పుమాగులూరు మీదుగా చిలకలూరిపేటకు, చిలకలూరిపేట నుంచి అద్దంకికి బస్సులు నడపాలి.
– కొండవర్ది చెంచులక్ష్మి , సోమవరప్పాడు
బస్టాండుకు
పూర్వ వైభవం తేవాలి
చిలకలూరిపేట, నరసరావుపేట, వినకొండ, చీరాల, అద్దంకి డిపోల నుంచి బల్లికురవ మండలంలో గతంలో తిరిగిన బస్సులు పునరుద్ధరించాలి. బస్సుల రద్దుతో ఇబ్బందులు పడుతున్నాం. బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలి.
– ఆవుల కోటేశ్వరరావు, బల్లికురవ
బల్లికురవ: సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు వందలాది బస్సులతో కళకళలాడిన బస్టాండ్ నేడు బస్సుల రద్దుతో ఆలనాపాలన లేక జీర్ణావస్థతో వెలవెలబోతుంది. వ్యర్థాల కుప్పలకు బస్టాండ్ ఆవరణం నిలయంగా మారుతోంది. ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం బల్లికురవకు నాలుగు రోడ్ల కూడలికి సమీపంలో బస్టాండ్‌ను నిర్మించింది. రెండు దశాబ్దాల పాటు అద్దంకి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, చీరాల డిపోలకు చెందిన బస్సులు వివిధ రూట్లలో తిరిగేవి. అద్దంకి డిపో పరిధిలో ఉన్న ఈ బస్టాండ్‌కు ఓ కంట్రోలర్‌ను నియమించారు. అన్ని డిపోల బస్సులు లోనికి వచ్చి వెళ్లేవి. ప్రయాణికులు ఇక్కడే బస్సుల రాక కోసం నీరీక్షించేవారు. 2005లో కంట్రోలర్ ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించలేదు. క్రమేపీ బస్సుల సంఖ్య తగ్గటంతోపాటు చీరాల, నరసరావుపేట, వినుకొండ డిపోల నుంచి బస్సులు పూర్తిగా రద్దు చేశారు.
ప్రయివేటు వాహనాల హవా..
5 డిపోలకు సంబంధించి 20 బస్సులకుపైగా రెండు దశాబ్దాల క్రితం వరకు వివిధ రూట్లలో తిరిగేవి. నేడు చిలకలూరిపేట డిపో నుంచి కుందుర్రుకు రోజుకు 4 ట్రిప్పులు, అద్దంకి డిపో నుంచి గొవాడ బల్లికురవ మీదుగా చిలకలూరిపేటకు 3 ట్రిప్పులు.. అద్దంకి డిపో నుంచి వైదన, బల్లికురవ మీదుగా చిలకలూరి పేటకు ఒక ట్రిప్పుతో 4 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రధాన గ్రామాలైన ఉప్పుమాగులూరు, వేమవరం, కొత్తూరు, వెలమవారిపాలెం, కోటావారి పాలెం, సోమవరప్పాడు, జమ్ముల మడక కాలనీలకు బస్సు వసతి లేదు. మండలం, నియోజకవర్గం జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే వీరి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కనీసం వైద్యానికి వెళ్లాలన్నా వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయివేట్ వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
కుప్పలుగా చెత్త
స్థానిక నాలుగురోడ్ల కూడలిలోని వ్యాపారులు వ్యర్థాలను బస్టాండ్ ఆవరణలోనే పడేయడంతో ఇటీవల వర్షాలకు కుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వ్యర్థాల కుప్పలు వేయడంతో పందులు సంచారం అధికమైంది. రెండు దశాబ్దాలు వినియోగంలో లేనందున టాయిలెట్స్, బస్టాండ్ ఆవరణ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులకు తోడు విద్యుత్ శాఖకు బిల్లు చెల్లించనందున సరఫరా నిలుపుదలతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. రూ.లక్షలు ఖర్చుతో నిర్మించిన భవనాలు జీర్ణావస్థకు చేరడంతో స్థల దాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బల్లికురవ పరిధిలోని పలు ప్రాంతాలకు బస్సు వసతి లేక ప్రజలకు కష్టాలు
ఆర్టీసీ బస్సుల కొరతతో జనం పాట్లు బల్లికురవ బస్టాండ్‌లో వ్యర్థాలతో దుర్గంధం కనీస ఆలనాపాలన లేక వెలవెల ‘ఉచిత’ పథకం సమయానికై నా బస్సులు నడపాలని డిమాండ్ ప్రయివేట్ వాహనాలతో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు

ఉచితం సరే.. అసలు బస్సే లేదే!

ఉచితం సరే.. అసలు బస్సే లేదే!

ఉచితం సరే.. అసలు బస్సే లేదే!