కొండవీడుకోటలో ఉద్రిక్తత
యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్‌కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్‌సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్‌రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు.
సమగ్ర విచారణ అనంతరంకేసులు నమోదు
సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్‌రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు.


