బంగారం దుకాణంలో ఆభరణాల చోరీ
●అసలు స్థానంలో నకిలీ వస్తువులు పెట్టి పరారీ
●సీసీ పుటేజ్ ద్వారా ముగ్గురు మహిళల గుర్తింపు
●దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు
నరసరావుపేటటౌన్ : బంగారు వస్తువుల కొనుగోలుకు వచ్చిన మహిళలు నకిలీవి పెట్టి అసలైన బంగారం దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి చరణ్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని శివుడి బొమ్మ సెంటర్లో గల శ్రీ శారద జ్యూయలర్స్ దుకాణంలోకి శనివారం ముగ్గురు మహిళలు వచ్చారు. బంగారు చెవి కమ్మలు కావాలని అడిగారు. అవి చూస్తూనే దుకాణ సిబ్బందిని మాటల్లో పెట్టి వారి వెంట తెచ్చుకున్న నకిలీ కమ్మలను అక్కడ పెట్టి అసలైన వాటిని అపహరించారు. సరిపడా డబ్బులు లేవని రేపు వచ్చి తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. బంగారం వస్తువుల తూకంలో వ్యత్యాసం రావడంతో అనుమానం వచ్చిన దుకాణ గుమస్తా యజమాని దృష్టికి తీసుకెళ్లారు. సీపీ పుటేజ్ పరిశీలించగా, ముగ్గురు మహిళలు నంబర్ ప్లేట్ లేని ఆటోలో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు దుకాణ యజమాని కపిలవాయి విజయ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు
ఆల్ ఔట్ రీఫిల్ ప్యాక్ నోటిలో పెట్టుకున్న బాలుడు మృతి
చిలకలూరిపేట టౌన్: ఆడుకుంటూ ఆల్‌ఔట్ రీఫిల్ ప్యాక్‌ను నోటిలో పెట్టుకున్న బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఉపాధి పనుల నిమిత్తం చిలకలూరిపేట పట్టణానికి మూడు నెలల కిందట భానుప్రతాప్‌సింగ్, లాలీదేవి దంపతులు తమ ముగ్గురు సంతానంతో వచ్చారు. స్థానిక రెడ్ల బజారులో అద్దె ఇంట్లో ఉంటూ మోర్ సమీపంలో ట్యాటూస్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 14వ తేదీన లాలీదేవి ఇంట్లో స్నానానికి వెళ్లింది. ఈ సమయంలో ఆడుకుంటున్న రెండేళ్ల నాలుగు నెలల రెండో కుమారుడు దీపక్‌సింగ్ పొరపాటుగా ఆల్‌ఔట్‌ను నోటిలో పెట్టుకున్నాడు. స్నానం ముగించి వచ్చిన తల్లి దీపక్ నోటి నుంచి నురగ రావడం గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ దీపక్ ఆదివారం మృతి చెందాడు.
కబడ్డీ అసోసియేషన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్‌గా మాబు హుస్సేన్
సత్తెనపల్లి: కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్‌గా షేక్ మాబు హుస్సేన్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ పల్నాడు జిల్లా సమావేశం శనివారం తాడేపల్లిలో నిర్వహించారు. ఇందులో సత్తెనపల్లికి చెందిన అంజి మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ షేక్ మాబు హుస్సేన్‌ను పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కాసాని వీరేష్ హాజరయ్యారు. ఎంపికై న వారికి పత్రాలు అందజేశారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్‌గా ఎన్నికై న షేక్ మాబు హుస్సేన్‌ను ఆదివారం పలువురు అభినందించారు.


