ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించారు. 231 అర్జీలు వచ్చాయి. పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తొలుత తహసీల్దార్‌కు, అక్కడ పరిష్కారం కాకుంటే ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వాలన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టరేట్‌కు రావచ్చన్నారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రచార బోర్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ బోర్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సముద్రంలో నాచు మొక్కలు పెంచాలి
సముద్రంలో నాచు మొక్కల పెంపకాన్ని జిల్లాలో విస్తారంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం నాచు మొక్కల పెంపకం ప్రాజెక్టును ప్రారంభిస్తోందని కలెక్టర్ చెప్పారు. యూనిట్ స్థాపనకు ప్రభుత్వమే నూరు శాతం రాయితీపై నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 40 శాతం రాయితీ కేంద్రం నుంచి లభిస్తుందన్నారు. మిగిలిన 60శాతం నిధులను గ్రీన్ కై ్లమేట్ ఫండ్, అప్సడా ద్వారా లబ్ధిదారుడికి ఉచితంగా అందిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 50 యూనిట్లు లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. చిన్నగంజాం మండలం ఏటిమెగ గ్రామంలో లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయడానికి అధికారికంగా ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.16వేలు నగదు ఇస్తామని తెలిపారు. మత్స్యశాఖ జిల్లా అధికారి గాలి దేవుడు, డీఆర్‌డీఏ పీడీ లవన్న, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలి
భారీ పరిశ్రమగా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తున్నందున భూమి త్వరగా కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల మంజూరు, నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ, భూమి కేటాయింపులపై రెవెన్యూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించారు. నిధులు సిద్ధంగా ఉన్నందున వేగంగా భూమి కేటాయించాలని కలెక్టర్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గం కింద బల్లికురవ మండలంలో 768 ఎకరాలు, మిగిలినవి సంతమాగులూరు మండలంలో భూమి గుర్తించాలన్నారు. 400 మంది రైతుల నుంచి భూసేకరణ జరగాల్సి ఉండగా, ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. భూసేకరణ కోసం రూ.120 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


