వైకుంఠ రాయుడు... నారసింహుడు
నేడు వైకుంఠ ఏకాదశి ముస్తాబైన ఆలయం బంగారు శంఖంలో తీర్థం
ముక్కోటికి భారీ బందోబస్తు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. శ్రీవారిని కొలిచేందుకు భక్తులు ముక్కోటి ఆశలతో సంసిద్ధులయ్యారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామి ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై దర్శన భాగ్యం కల్పించనున్నారు. తరలిరానున్న భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దక్షిణావృత శంఖంతో తీర్థం...
1820లో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖంతో స్వామికి అభిషేకం చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు ఈ శంఖంతో భక్తులకు తీర్థం అందిస్తారు. విశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీని పురస్కరించుకుని 30వ తేదీతోపాటు, 31వ తేదీన ద్వాదశి రోజున కూడా దక్షిణావృత శంఖ తీర్థాన్ని ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నేడు జరుగనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 320 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 50 ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు ఉన్నట్లు చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వీరు విధులకు హాజరయ్యారని పేర్కొన్నారు. షిఫ్ట్‌లవారీగా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు.
వైకుంఠ రాయుడు... నారసింహుడు
వైకుంఠ రాయుడు... నారసింహుడు


