పోలురాధా పందేలు అదరహో!
చినగంజాం: కడవకుదురు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల న్యూ జూనియర్ నాటుబండి పోలురాధా ఎడ్ల పందేలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కాగా సోమవారం వేకువజాము వరకు నిర్వహించారు. పోటీల్లో పలు ఎడ్ల జతలు పాల్గొనగా అత్యంత ఉత్కంఠంగా కొనసాగాయి. అనంతరం నిర్వాహకులు ఎడ్ల జతల యజమానుల విజేతలను ప్రకటించి వారికి అందజేశారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన ఆలా హరికృష్ణ యాదవ్ ఎడ్ల జత 5605.2 అడుగుల దూరం లాగి మొదటి స్థానం సాధించింది. కేకే కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన బత్తిన కోటేశ్వరరావు రూ.30,116 అందజేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన రామినేని శ్రీనివాసరావు ఎడ్ల జత 5100 అడుగులు లాగగా ద్వితీయ బహుమతి సాధించింది. రావి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారుడు రావి శ్రీనివాసరావు రూ.25,116 అందజేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన చెరుకూరు ఉషారాణికి చెందిన ఎడ్ల జత 5060.7 అడుగులు లాగి మూడో స్థానాన్ని సాధించాయి. కేశన వెంకట్రావు రూ.20,116 నగదు బహుమతి అందజేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణకు చెందిన ఎడ్ల జత 4868.5 అడుగులు లాగి నాలుగో స్థానం సాధించగా అడుసుమల్లి బ్రదర్స్ రూ.15,116 నగదు అందజేశారు. బాపట్ల జిల్లా బోయినవారిపాలేనికి చెందిన పిన్నబోయిన మహీంద్ర ఎడ్ల జత 4825.8 అడుగులు లాగి ఐదో స్థానం సాధించగా కేసన పిచ్చయ్య జ్ఞాపకార్థం రూ.10,116 నగదు అందజేశారు. బాపట్ల జిల్లా మున్నవారిపాలేనికి చెందిన కుమ్మరి నాగ శ్రావణి, చెరుకుపల్లికి చెందిన యలమందల వెంకట గోపాలకృష్ణకు చెందిన ఎడ్ల జతలు 4792.5 అడుగులు లాగి 6వ స్థానం సాధించగా కేసన చలపతిరావు, నాగరత్నం జ్ఞాపకార్థం కుమారులు రూ.7,516 నగదు బహుమతి అందజేశారు. పోటీలకు యాంకర్‌గా తంగడ హాసన్ వ్యవహరించారు.
పోలురాధా పందేలు అదరహో!


