సాక్షి ప్రతినిధి,బాపట్ల: స్థానిక సంస్థలలో ఖాళీ స్థానాల భర్తీకి గురువారం జరిగిన ఉప ఎన్నికలలో పచ్చ పార్టీ కుట్రలు భగ్నమయ్యాయి. నామమాత్రమైన బలం లేక పోయినా పదవులను చేజిక్కించుకునేందుకు పచ్చ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు వైఎస్సార్ సీపీ నాయకుల ఐక్యత ముందు పటాపంచలయ్యాయి. బాపట్ల జిల్లాలోని పలు స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పచ్చపార్టీ పన్నిన కుట్రలు ఫలించలేదు. సొంత మండలం మండల పరిషత్ అధ్యక్ష పదవి కొట్టేయాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రలోభాలు, బెదిరింపులకు బెదరకుండా మెజార్టీ ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. గురువారం జరిగిన ఎన్నికలో తమ అభ్యర్థి సీతారామరాజును ఎంపీపీగా గెలిపించుకొని విజయకేతనం ఎగురవేశారు. పిట్టలవానిపాలెం ఎంపీపీగా ఉన్న చందోలు–1 ఎంపీటీసీ షేక్ బాజీ తన పదవికి రాజీనామా చేయడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. పిట్టలవానిపాలెం పరిధిలో మంతెనవారిపాలెం, పిట్టలవానిపాలెం, జీఎన్‌పాలెం, ఖాజీపాలెం, పిట్టువారిపాలెం, భవనంవారిపాలెం, సంగుపాలెం, చందోలు–1,2,3 స్థానాలాతో కలిపి మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గురువారం మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సంగుపాలెం ఎంపీటీసీ గంగయ్య ఒక్కరే టీడీపీకి మద్దతు పలకగా మిగిలిన 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. ఎంపీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన పిట్టలవానిపాలెం ఎంపీటీసీ దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు.
భట్టిప్రోలు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉపసర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా రేపల్లె మండలం పేటేరు ఉపసర్పంచ్‌గా టీడీపీకి మద్దతుదారు శ్రీదేవి, భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉపసర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికలో పిట్టలవానిపాలెం ఎంపీపీ పదవిని వైఎస్సార్ సీపీ దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులలో నూతనోత్తేజం వచ్చింది. సంబరాలు చేసుకున్నారు.
భయపెట్టినా..నిలబడ్డారు
ప్రలోభాలకు లొంగలేదు
పిట్టలవానిపాలెం ఎంపీపీ పదవి
దక్కించుకున్న వైఎస్సార్ సీపీ
పలు ఉపసర్పంచ్ పదవులు కై వసం
వైఎస్సార్ సీపీ జయకేతనం


